వేంకటపతి దేవరాయలు | పెన్నా యుద్ధం | Venkata - II of Vijayanagara Empire | Battle of Penna


వేంకటపతి దేవరాయలు | పెన్నా యుద్ధం

Venkata - II of Vijayanagara Empire | Battle of Pennar



ఉపోద్ఘాతం:

16వ శతాబ్దం రెండో భాగంలో విజయనగర సామ్రాజ్యం ఎన్నో ఎదురు దెబ్బలను తట్టుకోవల్సివచ్చింది. 1565వ సంవత్సరంలో జరిగిన తాళికోట యుద్ధంలో అతి పెద్ద ఓటమిని ఎదుర్కోవాల్సివచ్చింది. ఆ యుద్ధంలో విజయనగర సర్వసైన్యాధ్యక్షుడు అళియ రామరాయలు, అతని తమ్ముడు వేంకటాద్రి చనిపోయారు. హంపీ పట్టణం పూర్తిగా ధ్వంసమయింది. ఇవన్నీ ఆ మహాసామ్రాజ్యాన్ని అతలాకుతలం చేసాయి.

యుద్ధం నుండి తిరిగివచ్చిన తిరుమలరాయలు అనుకోనివిధంగా హంపీని వదిలిపెట్టాడు. నామామాత్రపు చక్రవర్తి సదాశివరాయల్ని తీసుకుని పెనుగొండను చేరుకున్నాడు. ఈ చర్య సామ్రాజ్యపు మనోస్థైర్యాన్ని దెబ్బతీసిందని చెప్పొచ్చు.

రాజధాని పెనుగొండకు మారిన సామ్రాజ్యం తలరాత మారలేదు. శత్రువులు దాడి చేయకుండా మానలేదు. చక్రవర్తిగా తిరుమలరాయలు పాలించిన మూడు సంవత్సరాల్లో సామ్రాజ్యపు ఎన్నో భాగాలు శత్రువుల చేతికి చిక్కాయి. 

ఎంతో వైభవంతో వెలిగిన విజయనగర సామ్రాజ్యం వెలవెలబోసాగింది. పూర్తిస్థాయి పతనం వైపుకు అడుగులు వేయసాగింది. ఇప్పుడు విజయనగరాన్ని రక్షించే సమర్థుడు ఒకడు కావాలి. పతనాన్ని ఆపి, ఉత్థానం వైపుకు నడిపించగలిగే నాయకుడు కావాలి. ఆరిపోతున్న దీపాన్ని నిలిపే ప్రాణదాత కావాలి.

ఎవరతను?


సమస్యలు, సవాళ్ళు


రెండవ వేంకటపతి అధికారానికి వచ్చినప్పుడు విజయనగర సామ్రాజ్యం ముక్కలు చెక్కలైన కుటుంబంలా ఉండింది. ఎటుచూసిన దురాశ, నిర్లిప్తత, నిస్సత్తువ! దేశభక్తి అన్నది కనుచూపు మేరలో కనబడేది కాదు. ఇటువంటి కష్టసమయంలో సింహాసనమెక్కాడు వేంకటపతి.


రెండవ వేంకటపతి సాధించిన ఘనతల్ని తెలుసుకోవలంటే మొదట అతని వెనుక పాలించినవాళ్ళు వదిలివెళ్ళిన సవాళ్ళను అర్థం చేసుకోవాలి. 


1578వ సంవత్సరంలో వేంకటపతి తండ్రి తిరుమలరాయలు చనిపోయాడు. అప్పటికే విజయనగరం ఎంతో భూభాగాన్ని పోగొట్టుకునింది. ఒకవైపు గోల్కొండ, మరోవైపు బిజాపూర్ చొచ్చుకువచ్చాయి. ఉత్తరదిశలోని కొండవీడు, గండికోట, ఆదోని వంటి కీలకమైన కోటలు గోల్కొండ చేతికి చేరాయి. పశ్చిమ సరిహద్దుల్లోని ధార్వాడ్, తుర్కల్, బంకాపూర్ వంటి ముఖ్యమైన కోటలు బిజాపూర్ వశమయ్యాయి.


తిరుమలరాయల తర్వాత వచ్చిన మొదటి శ్రీరంగరాయల కాలంలో కూడా విజయనగరం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంది. రంగరాయల తొలిరోజుల్లోనే కర్నాటక పశ్చిమ సముద్రతీర ప్రాంతం మొత్తం బిజాపూర్ సల్తన్ అలీ అదిల్ షాకు లొంగిపోయింది.


తూర్పున తమిళనాడు సముద్రతీరంలో అలజడులు మొదలయ్యాయి. అక్కడి బలమైన తెగలు కొన్ని రంగరాయలను తమ రాజుగా గుర్తించడానికి నిరాకరించాయి.


ఈ సమస్యలు చాలదన్నట్టు, బిజాపూర్ సైన్యాలు నేరుగా పెనుగొండ పైనే దండెత్తి వచ్చాయి. అలి అదిల్ షా పెనుగొండపై చేసిన దండయాత్రను రంగరాయలు సమర్థవంతంగా తిప్పికొట్టాడు. ఒక వైపు దౌత్యం, మరోవైపు యుద్ధం - ఇలా రెండువైపులా పదునువున్న కత్తిలాంటి వ్యూహంతో రంగరాయలు రాజధానిని కాపాడుకున్నాడు. 1586వ సంవత్సరంలో రంగరాయలు చనిపోయాడు. ఎనిమిది సంవత్సరాల అతని పాలనలో విజయనగరం సాధించడం కంటే పోగొట్టుకున్నదే ఎక్కువ అని చెప్పవచ్చు.


ఫలించని వ్యూహాలు:

ఒకటవ రంగరాయల కాలంలో సరిహద్దు ప్రాంతాల్లోని ఎన్నో గ్రామాలు నిర్మానుష్యమయ్యాయి. పంటభూములు బంజరు భూములయ్యాయి. ఆలయాల్లో పూజలు నిలచిపోయాయి.


ఇందుకు కారణం - తిరుమలరాయలు, అతని వారసుడు రంగరాయలు అనుసరించిన రక్షణాత్మక విధానం. వీరిద్దరు ఆత్మరక్షణకు పెద్దపీట వేసారు. ఎదురు దాడులను ఎక్కువగా చేయలేదు. సామంత రాజుల సహకారం లేకపోవడం వల్ల వీళ్ళిద్దరు ఇలాంటి పద్ధతిని అనుసరించాల్సివచ్చింది. తాళికోటలో తమ చక్రవర్తి ఓడిపోయినందువల్ల విజయనగర సామంతులు స్వతంత్రాన్ని ప్రకటించుకునే దిశలో ఆలోచించడం మొదలుపెట్టారు. దీనికి తోడు ఎందరో పాళేగార్లు దోపిడీ దొంగల్లాగా ప్రజల్ని దోచుకోసాగారు.


ఇలాంటి ఘోరమైన, గందరగోళ పరిస్థితుల్లో వేంకటపతిరాయలు సింహాసనమెక్కాడు.


వారసత్వ పోరాటం:

నిజానికి రంగరాయల వారసత్వపు పోటీలో వేంకటపతి రాయలు లేనే లేడు. వేంకటపతి అన్నల్లో ఒకడైన రామరాయల ఇద్దరు కొడుకుల్లో ఒకరు చక్రవర్తి కావల్సివుండింది. కానీ విజయనగర హితాన్ని కోరే కొందరు మంత్రులు, సైన్యాధికారులు ఆ ఇద్దరు చిన్నపిల్లలను కాదని వేంకటపతిని రాజుగా ఎన్నుకున్నారు. 

ఇలా, అనుకోనివిధంగా, రెండవ వేంకటపతి విజయనగర చక్రవర్తి అయ్యాడు.

కొత్త చక్రవర్తి - సవాళ్ళు

ఇప్పుడు చక్రవర్తిగా వేంకటపతి సరిచేయాల్సిన అతి పెద్ద సవాలు ఒకటివుంది. శత్రువుల చేతుల్లోకి వెళ్ళిన భూభాగాల్ని వెనక్కు రాబట్టడమే ఆ సవాలు. ఇప్పుడున్న ప్రాంతాలను కాపాడుకుంటూనే చేజారిన భాగాలను స్వాధీనం చేసుకోవాలి. అలా చేయలేకపోతే ఆదాయం ఉండదు. ఆదాయం లేకపోతే రాజ్యాన్ని, సైన్యాన్ని నడపడం సాధ్యం కాదు. కనుక, ఎలాగైనా సరే రాజ్యాన్ని విస్తరించాల్సిన అవసరం వేంకటపతికి ఉంది.


కానీ తన ఇల్లే ముక్కలు చెక్కలై ఉంది. ఈ సమయంలో శత్రువులపై ఎదురుదాడి చేయడం కుదరదు. తన ఆధీనంలో ఉన్న ప్రాంతాల్లో తిరుగుబాటు చేస్తున్నారు కొందరు. ప్రజల్ని దోచుకుంటున్నారు ఇంకొందరు. మొదట వీళ్ళ భరతం పట్టాలి. ఆపై స్వతంత్ర రాజులు కావాలని చూస్తున్న సామంతులను కట్టడి చేయాలి. ఇవి కాక చీటికి మాటికీ జరుగుతున్న దండయాత్రల్ని తిప్పికొట్టాలి అని భావించాడు వేంకటపతి.


అంతేకాదు, తాళికోట యుద్ధంలో తగిలిన దెబ్బను, ఎదురైన అవమానాన్ని తుడిచివేస్తే గానీ సామంతులకు, సామ్రాజ్య ప్రజలకు తనపై నమ్మకం, గౌరవం కలగదు. కొన్ని గొప్ప యుద్ధవిజయాల్ని సాధిస్తే గానీ పతనం వైపుకు సాగుతున్న విజయనగరం నిలబడలేదు. అలాంటి రెండు అవకాశాలు వేంకటపతిని వెదుక్కుంటూ వచ్చాయి.


వేంకటపతి వ్యూహాలు - పెనుగొండ యుద్ధం


ఆరవీడు వంశం గురించి చక్కటి పుస్తకం వ్రాసిన ఫాదర్ హెన్రీ హేరాస్ ప్రకారం రెండవ వేంకటపతి చక్రవర్తిగా తన పాలనను శత్రువులపై ఎదురుదాడులు చేయడంతో మొదలుపెట్టాడు.


నిజానికి వేంకటపతి విజయపరంపర ఒక ఎదురుదాడితో కాక ఆత్మరక్షణతో మొదలుకావడం విశేషం. పెనుగొండను చుట్టుముట్టిన గోల్కొండ సైన్యాన్ని వేంకటపతి ముప్పుతిప్పలు పెట్టించి, తరిమి కొట్టిన విధానం రోమాంచనం కలిగించే ఘట్టం.


రెండవ వేంకటపతి విజయనగర గద్దెను ఎక్కగానే, గోల్కొండ సల్తన్ ముహమ్మద్ కులీ కుతుబ్ షా విజయనగరంపై యుద్ధం ప్రకటించాడు. విజయనగరాన్ని ఆక్రమించి, వేంకటపతిని తరిమివేయడమే ముహమ్మద్ కులీ లక్ష్యం. గోల్కొండ నుండి బయల్దేరిన కుతుబ్ షా సైన్యం ఎలాంటి ఆటంకాలు లేకుండా పెనుగొండను చేరుకున్నాయి. ఆ పట్టణాన్ని అష్టదిగ్బంధనం చేసింది.


తన ఇంటి వాకిలి వద్ద వచ్చి చేరిన శత్రువును చూసి వేంకటపతి భయపడలేదు. అలాగని ఎదురుదాడి చేయలేదు. శాంతి సందేశాన్ని తెలుపుతూ తన రాయబారుల్ని సల్తన్ వద్దకు పంపాడు. గోవిందరాజ తిమ్మ అనే మంత్రి, పాపయ్యచెట్టి అనే సైన్యాధికారి రాయబారులుగా ముహమ్మద్ కులీ దగ్గరకు వెళ్ళారు. శాంతి ఒప్పందం చేసుకుందామని ప్రతిపాదించారు. వేంకటపతి భయపడ్డాడని భావించిన ముహమ్మద్ కులీ రాయబారాన్ని ఒప్పుకున్నాడు. ఇక పెనుగొండ తనదే అని అనుకున్న కుతుబ్ షా విందులు, వినోదాల్లో మునిగిపోయాడు.


ఇదే అవకాశంగా తీసుకున్న వేంకటపతి, ముహమ్మద్ కులీకి తెలియకుండా పెనుగొండ కోటను సైన్యంతో నింపసాగాడు. శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చిన మొదటి మూడు రోజుల్లో పెద్దయెత్తున ఆహారపదార్థాలను కోటలోకి తరలించారు. నాలుగోరోజు విజయనగర దండనాయకులు జగ్గదేవ, గుల్రంగ్ చెట్టి, మనుపరాజు, పాపయ్య చెట్టి మొదలైనవారు 30,000 మంది మస్కటీర్స్ అంటే తుపాకుల్ని పేల్చే సైనికుల్ని కోటలోకి సాగించారు.


ఇలా వేంకటపతి ఆత్మరక్షణ, ఎదురుదాడికి తగిన ఏర్పాట్లు చేసుకుంటుంటే, అక్కడ ముహమ్మద్ కులీ తన శిబిరంలో కులాసాగా కాలం గడుపుతున్నాడు. ఇంతలో వేంకటపతి మరో అద్భుతమైన ఎత్తుగడ వేసాడు. కోటను తను కాపాడుతున్న సమయంలో శత్రువును బయటనుండి ముట్టడించే పథకం వేసాడు. ఇందుకు తంజావూరు పాలకుడైన అచ్యుతప్ప నాయకుడి సహాయం అడుగుతూ వర్తమానం పంపాడు. విజయనగర సమ్రాట్టుల నమ్మినబంటైన అచ్యుతప్ప తన రెండవ కుమారుడు రఘునాథనాయకుడికి పెద్ద సైన్యాన్ని ఇచ్చి పంపాడు.

పెనుగొండ రక్షణ


పెనుగొండ యుద్ధం వివరాలు "రఘునాథాభ్యుదయం" అనే కావ్యంలో కొంత దొరుకుతాయి. ఇది తంజావూరు రఘునాథనాయకుని జీవిత చరిత్ర. 


పెనుగొండ కోటలో ఉన్న విజయనగర సైనికులు అలలు అలలుగా బయటకు వచ్చి, ముహమ్మద్ కులీ సైన్యం మీద కాల్పులు జరిపి, మెరుపువేగంతో కోటలోకి వెళ్ళసాగారు. 

ఇలా కొంతకాలం గడిచాక, తంజావూరు రఘునాథ నాయకుడి సైన్యం పెనుగొండ మైదాన ప్రాంతానికి వచ్చి చేరిందని సమాచారం వచ్చింది. వెంటనే జగ్గదేవుడి నాయకత్వంలో వేలాది విజయనగర సైనికులు తుపాకీలు పేలుస్తూ ఒక్కసారిగా ముహమ్మద్ కులీపై విరుచుకు పడ్డారు.


ఇదే సమయంలో, తంజావూరు సైన్యంలోని గుర్రపు దళాలు గోల్కొండ సైన్యాన్ని రెండువైపుల నుండి చుట్టుముట్టాయి. ముహమ్మద్ కులీ వేంకటపతి పన్నిన చక్రవ్యూహంలో ఇరుక్కుపోయాడు. వెంటనే తన శిబిరాన్ని ఖాళీ చేసి, మిగిలిన సైన్యాన్ని కూడగట్టుకుని, పెనుగొండ నుండి పారిపోయాడు.


పెనుగొండ దుర్గరక్షణ విజయనగర కొత్త చక్రవర్తి సాధించిన మొట్టమొదటి ఘనవిజయం.


వేంకటపతి దూకుడు


గోల్కొండపై తను సాధించిన మొదటి విజయం వేంకటపతి ఆత్మస్థైర్యాన్ని పెంచింది. పారిపోతున్న శత్రువును వదిలిపెట్టకూడదని అనుకున్నాడు. బలిపశువు అని అనుకున్న విజయనగరం ఇప్పుడు వేటగాడిగా మారింది. గోల్కొండ సైన్యాన్ని వెన్నంటి తరమసాగింది.


వేంకటపతి రాయల కాలానికి చెందిన కొన్ని రాగిరేకు శాసనాలలో గోల్కొండ సల్తను ఓటమికి సంబంధించిన కొన్ని వివరాలు ఉన్నాయి. ఈ శాసనాల ప్రకారం పెనుగొండ నుండి పారిపోతున్న గోల్కొండ సైన్యానికి, విజయనగర సైన్యానికి మధ్య ఎన్నో చిన్న చిన్న యుద్ధాలు జరిగాయి. విజయనగరం చేస్తున్న ప్రతి ఎదురుదాడిలోనూ గోల్కొండ ఓడిపోయి, పారిపోసాగింది.


విళాపాక రాగిరేకు శాసనం ప్రకారం రెండ వేంకటపతి ఇభరాముని కొడుకు పై వరుస విజయాలను సాధించాడు. ఇభరాముడు అంటే గోల్కొండ నవాబైన ఇబ్రహీం కులీ కుతుబ్ షా. అతని కొడుకు ముహమ్మద్ కులీ.


ఒక్కొక్క విజయం ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో, వేంకటపతి తన జోరును మరింత పెంచాడు. ఒక్క తంజావూరు సైన్యమే కాక మరికొంతమంది సామంతులు, పాళేగార్లు తమ కొత్త చక్రవర్తి సహాయానికి వచ్చారు. పిల్లకాలువలా మొదలైన వేంకటపతి సేనావాహిని ఇప్పుడు మహానదిలా మారింది. విజయనగర సామంతులు, దండనాయకులు రెండువైపులా తరుముతుంటే, మూడో దిక్కున సాక్షాత్తు చక్రవర్తినే గోల్కొండ సైన్యం మీదకు ఉరుకుతున్నాడు.


పెన్నా యుద్ధం / Battle of Pennar


విళాపాక శాసనం ప్రకారం విజయనగరంతో జరిగిన ప్రతి చిన్న యుద్ధం కూడా ముహమ్మద్ కులీని తీవ్రంగా నష్టపరిచింది. ప్రతి దాడిలోను అతను గుర్రాలను, ఏనుగులను, సైన్యాధిపతుల్ని పోగొట్టుకోసాగాడు. వేంకటపతి ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా అప్రతిహతంగా దాడి చేస్తూనే ఉన్నాడు.


పెనుగొండలో చావు తప్పి కన్ను లొట్టపోయిన ముహమ్మద్ కులీ వీలైనంత త్వరగా విజయనగర సీమల్ని దాటాలని ప్రయత్నించాడు. కానీ వాతావరణం అతనికి సహకరించలేదు. వర్షాకాలం దగ్గరపడడంతో వానలు విపరీతంగా కురవసాగాయి. దారులు బురదగుంటలుగా మారాయి. గోల్కొండ సైన్యం ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకుంది. ఇలాంటి నేపధ్యంలో ముహమ్మద్ కులీ స్వయంగా నాయకత్వం వహిస్తున్న గోల్కొండ సైన్యం పెన్నా నది ఒడ్డుకు చేరుకుంది. ఇది ముహమ్మద్ తలరాతనో లేక తెలివితక్కువతనమో కాలమే తేల్చాలి.


ఎందుకంటే, యుద్ధసమయంలో నదులు, కొండలు కీలకమైన పాత్రను పోషిస్తాయి. ఇవి మనకు, మన శత్రువుకు మధ్య ఉంటే మనం సురక్షితంగా ఉన్నట్టే. కానీ ఇవి మన మార్గానికి అడ్డువస్తే, శత్రువుకు అనుకూలం. ఇప్పుడు ముహమ్మద్ సైన్యం, పెన్నా నది ఒడ్డుకు వచ్చి చేరింది. వానల వల్ల పెన్న ఉప్పొంగి పారుతోంది. అలాంటి నదిని దాటడమంటే చావుని కోరి కోరి నెత్తిన వేసుకోవడమే. అలాగని అక్కడే ఉంటే, విజయనగర సైన్యం చావుదెబ్బ తీస్తుంది. 


అనుభవజ్ఞుడైనా ముహమ్మద్ కులీ చేయకూడని తప్పును చేసాడు. బహుశా వరుస పరాజయాలు అతడి ఆలోచనాశక్తిని దెబ్బ తీసివుండాలి. ఏదిఏమైనా ఇప్పుడు ముహమ్మద్ కులీకి విజయనగర సైన్యాన్ని ఎదుర్కోవడం తప్ప వేరే మార్గం లేదు. పొంగి పారుతున్న పెన్నా నది గోల్కొండ సైన్యాన్ని తన ఒడ్డున కట్టిపడేసింది.

*****

పాఠకులకు సూచన - Disclaimer

విజయనగరానికి-గోల్కొండకు మధ్య పెన్నా నది తీరంలో యుద్ధం జరిగిందని చెప్పే ఆధారాలు ఉన్నాయి గానీ ఆ యుద్ధం ఎలా జరిగిందో తెలిపే వివరాలు లేవు. 16వ శతాబ్దంలో జరిగిన కొన్ని యుద్ధాల వివరాల ఆధారంగా "ఇలా జరిగివుండొచ్చు" అని మేము ఊహించాము. ఆ ఊహనే ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాం. కనుక ఇది చారిత్రికంగా ఖచ్చితమైన నిరూపణ కాదని వీక్షకులు గమనించగలరు.

*****

రక్తం పొంగిన పెన్నా నది


పెన్నానది ఒడ్డున చిక్కుపడిన గోల్కొండ సైన్యం ఉరికి వస్తున్న విజయనగర సైన్యాన్ని ఎదుర్కోవడానికి ఏర్పాట్లు చేసుకుంది. ఆత్మరక్షణలో పడిన ముహమ్మద్ కులీ తన సైన్యానికి ముందుభాగంలో ఫిరంగుల్ని నిలిపాడు. వీలైనంత దూరం నుండే విజయనగర సైన్యాన్ని ముక్కలు చేయాలన్నది అతని ఆలోచన. 


ఫిరంగులతో కాక నేరుగా ఎదుర్కొంటే అపారమైన విజయనగర సైన్యం తన సైన్యాన్ని కొన్ని గంటల్లోనే నాశనం చేస్తుందని ముహమ్మద్ కులీకి తెలుసు. కనుక విజయనగర సైన్యాన్ని వీలైనంత ధ్వంసం చేయడానికి తన ముందు ఫిరంగుల్ని నిలిపాడు. ఇప్పుడు గోల్కొండ సైన్యం బ్రతుకుకు, చావుకు మధ్య అడ్డుగోడ ఈ ఒక్క ఫిరంగి దళం మాత్రమే.


ఒక్కసారిగా గోల్కొండ ఫిరంగులు అగ్నివర్షం కురిపించసాగాయి.


గోల్కొండ సైన్యం వైపుకు దూసుకెళ్తున్న విజయనగర సైన్యం మీద ఫిరంగు గుళ్ళ వర్షం కురిసింది. విజయనగర దళాల్లో ముందువరుసలో ఉన్న సైనికులు క్షణకాలంలోనే చచ్చిపడ్డారు. వెనక వరుసలో ఉన్న సైనికుల్ని ముందుకు ఉరికే విధంగా దండనాయకులు అరుస్తున్నారు. ప్రోత్సహిస్తున్నారు.


విజయనగర సైనికాధికారులకు ఈ యుద్ధం ఎలా చేయాలో స్పష్టమైన అవగాహన ఉంది. ప్రస్తుతం గోల్కొండదే పైచేయిగా కనిపిస్తున్నా అది ఎంతోసేపు నిలబడదు. ఎందుకంటే ఫిరంగులు నిరంతరాయంగా గుళ్ళను పేల్చలేవు. ఒక్కొక్క కాల్పుకు అవి వేడెక్కుతాయి. ఎంతా వేడెక్కుతాయంటే అలానే వాడుతుంటే ఫిరంగి యొక్క ఉక్కు నాళికలు కరిగిపోతాయి. అప్పుడు ఫిరంగి ఎందుకూ పనిరాకుండా పోతుంది. కనుక కొంతసేపు వాడిన తర్వాత ఫిరంగులు చల్లారేందుకు సమయం ఇవ్వాలి.


ఇప్పుడు ముహమ్మద్ కులీ తన మొత్తం ఫిరంగిదళాన్ని వాడుతున్నాడు. ఫిరంగులన్నీ ఒకేసారి కాల్పులు సాగిస్తున్నాయి. అంటే కొంతసమయం తర్వాత ఆ ఫిరంగులు చల్లారడానికి కాల్పులను ఆపివేయాలి. అదే అదనుగా, విజయనగర సైన్యం ముందుకు ఉరికి ఆ ఫిరంగిదళాన్ని ధ్వంసం చేయాలి. అప్పటివరకు, గుళ్ళవర్షాన్ని తట్టుకుంటూ, ఒక్కొక్క అడుగే ముందుకు సాగాలి. ఈ వ్యూహాన్నే ప్రస్తుతం విజయనగర సైన్యాధికారులు చేస్తున్నది. తమ సైనికులు పారిపోకుండా ఉత్సాహపరిస్తూ ముందుకు సాగనిస్తున్నారు.


చివరకు, విజయనగరం దళాధిపతుల అంచనా నిజమయింది. అనుకున్నదాని కంటే త్వరగానే గోల్కొండ ఫిరంగులు కాల్పులను ఆపేసాయి. అప్పటివరకూ ఫిరంగి దాడిని ఎదుర్కున్న దళాలకు విశ్రాంతిని ఇచ్చి, తన అదనపు దళాలను ముందుకు దూకించింది విజయనగరం. ఈవిధంగా, ముహమ్మద్ కులీ ఏర్పాటు చేసుకున్న రక్షణా కవచం జారిపోయింది.


విజయనగర సైన్యం గోల్కొండ ఫిరంగిదళాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. ఫిరంగులకు కొంతదూరంలో, నదీతీరానికి దగ్గరగా నిలబడివున్న ముహమ్మద్ కులీపై దాడికి పూనుకొంది. ఇదే అదనుగా, వేంకటపతి తన అంగరక్షకదళాన్ని తీసుకుని యుద్ధరంగంలోకి దూకాడు. స్వయంగా చక్రవర్తినే కత్తిపట్టి కదనరంగానికి రావడం చూసిన విజయనగర సామంతులు, దండనాయకులు రెట్టించిన ఉత్సాహంతో గోల్కొండ దళాలపై విరుచుకుపడ్డారు.


బ్రతుకుపై ఆశను వదిలేసిన గోల్కొండ సైనికులు యుద్ధాన్ని కొనసాగించే ప్రయత్నం చేసారు. బ్రతుకు పై ఆశవున్న వారు పెన్నానదిలోకి దూకి పారిపోయే ప్రయత్నం చేసారు. ఒడ్డున నిలబడిన గోల్కొండ సైనికులు విజయనగరపు వాడికత్తులకు బలయ్యారు. నదిలోకి దూకిన వారు పెన్నలో పీనుగులై తేలారు. అదృష్టం బాగుండి, ముహమ్మద్ కులీ ఎలాగోలా పెన్నను దాటి తన ఊరి వైపుకు పరుగుపెట్టాడు.


వేంకటపతి విజయం 


ఈవిధంగా, విజయనగరం కొత్త చక్రవర్తి వీర ప్రతాప వేంకటపతిదేవరాయ మహారాయలు తన నాయకత్వ పటిమను, యుద్ధవ్యూహాచతురతను నిరూపించాడు. ఆపై కొన్నేళ్ళకు తాళికోట యుద్ధం తర్వాత పోగొట్టుకున్న భూభాగాలలో చాలవరకు తన అధీనంలోకి తెచ్చుకున్నాడు.


ఆరిపోతున్న విజయనగర సామ్రాజ్య దీపాన్ని కాపాడిన వేంకటపతిని ఆనాటి విజయనగర కవులు సంస్కృత, తెలుగు భాషల్లో నోరారా కీర్తించారు.


సీ. బలము గూడిన జూచి నిలువని ఇభరాము

కొడుకు భీతికి గోలకొండ సాక్షి

వెన్నాడి తత్సేన వీగ దోలుటకును

బృధురక్తమున నుబ్బు పెన్న సాక్షి

నీవాడనన బ్రోచి నిర్భయంబున వాని

కిది మేర యిడుటకు గృష్ణ సాక్షి

యెదిరించు వైరుల మదమెల్ల నవలీల

దూలించుటకును నందేల సాక్షి


గీ.  గాగ నసదృశబాహు విక్రమ విభూతి

దనకు వేలూరు వరరాజధాని గాగ

వీర వేంకటపతిరాయ విభుండు మిగుల

ధరణి బాలించె ధర్మతత్పరత జెలగి


Comments

Popular posts from this blog

Singaya Bhatta - A Master Engineer from 14th century Vijayanagara

కాకతీయుల కాలపు ఆలయ ఆర్థిక & ప్రజా సంక్షేమ వ్యవస్థ: 1236 నాటి గుడివాడ భీమేశ్వర శాసనాల విశ్లేషణ

జలసూత్రద సింగయ భట్ట: 14వ శతాబ్దపు విజయనగర నీటిపారుదల ఇంజనీరింగ్ అద్భుతం